తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.!
Publish Date:Sep 7, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కీలక నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీ ప్రకటన అధికారికంగా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సరళికి పూర్తి భిన్నంగా, పూర్తిగా ప్రజా పక్షం వహించే సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడమే లక్ష్యంగా తన కొత్త పార్టీ ఉంటుందన్నారాయన. సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి ప్రస్తుత రాజకీయ పార్టీలవి కేవలం ఎన్నికల రాజకీయాలే తప్ప, వాటిలో సామాన్యుల నిజమైన సమస్యలను పట్టించుకునే తత్వం కరువైందని విమర్శించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ధోరణులు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సమాజంలోని నిరుపేదలు, సామాన్యులు, కర్షకులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలకు అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా గొంతుక వినిపించేందుకు ఒక బలమైన శక్తి అవసరమని, అందుకే తాను తన నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని విజయసాయి వివరించారు. ఈ కొత్త రాజకీయ వేదిక విశేషాలు, పార్టీకి సంబంధించిన పూర్తి విధివిధానాల ప్రకటన త్వరలోనే దశలవారీగా వెల్లడిస్తామన్న విజయసాయి.. కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పరిపాలనా విధానాన్ని అందించేందుకు తన రాజకీయ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రజా సమస్యలపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించనున్నట్లు విజయసాయి చెప్పారు. తన కొత్త పార్టీ సీఎం అభ్యర్థిని తాను కాదని ఈ సందర్భంగా చెప్పిన విజయసాయి.. సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను తీసుకున్న రాజకీయ విరామ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు చెప్పారు.
[Vijayasai Reddy Announce new party, AP politics, YCP, TDP, Andhra Pradesh politics, Vijayasai Reddy announcement, Teluguone]
http://www.teluguone.com/news/content/----[vijayasai-reddy-announce-new-party-39-230887.html





